The altercation between the police and the locals in Rajahmundry
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా గడిచిన మూడు రోజులుగా రెడ్ జోన్ లో ఉంచడం జరిగింది. దాంతో ఎవ్వరూ బయటకు రాకుండా పోలీసులు చాలా కట్టడి చేశారు. కానీ ఆజాద్ చౌక్ లో పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చిన్న పిల్లలు తాగడానికి మూడు రోజుల నుంచి పాలు కూడా లేవంటూ మహిళలు, స్థానికులు రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులు ఆజాద్చౌక్ను రెడ్ జోన్‌గా ప్రకటించి అన్ని దారులు మూసేశారు.
అయితే నిత్యావసర సరుకులేవి తమ వద్దకు సరపరా అవడం లేదంటూ స్థానికులు పోలీసులతో గొడవకు దిగారు. జైలులో పెట్టినట్టుగా బాధపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు ఘర్షణకు దిగడంతో పోలీసు బృందాలు భారీగా మోహరించాయి. విషయం తెలుసుకున్న రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆజాద్‌చౌక్ ప్రాంత ప్రజలకు పాలు, నిత్యావసర వస్తువులు హుటాహుటిన అందజేయడంతో అక్కడ పరిస్థితి సద్ధుమనిగింది.