The evacuation process will begin tomorrow
కరోనా వ్యాపిస్తున్న తరుణంలో విధించిన లాక్ డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుబడిపోయిన లక్షలాది మంది భారతీయుల తరలింపు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ చరిత్రలో ఓ దేశం తలపెట్టిన అతిపెద్ద ఇవాక్యుయేషన్ ఇదే కావడం గమనార్హం. మొత్తం 3 లక్షల మందికి పైగా ప్రజలు, తాము ఇండియాకు తిరిగి వస్తామని ఇప్పటికే దరఖాస్తు చేశారు. వీరందరి కోసం ప్రత్యేక విమానాలను నడపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక యూరప్ దేశాల నుంచి ఇండియాకు వచ్చేందుకు రూ. 50 వేలను, అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేందుకు రూ. 1 లక్ష చార్జీగా నిర్ణయించారు.
ఇక, మాల్దీవులు, పశ్చిమ ఆసియా దేశాల్లో ఉన్న భారతీయులను యుద్ధ నౌకల ద్వారా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 విమానాలు యూఏఈ నుంచి యూఎస్, యూకే, సౌదీ అరేబియాల నుంచి 7, సింగపూర్ నుంచి 5, ఖతార్ నుంచి 2 విమానాలు వస్తాయని, మలేషియా, బంగ్లాదేశ్, కువైట్, ఫిలిప్పీన్స్, ఓమన్, బహరైన్ నుంచి కూడా సర్వీసులు నడుస్తాయని అధికారులు తెలిపారు. ప్రతి విమానంలో భౌతిక దూరం పాటించేలా 200 నుంచి 300 మందిని మాత్రమే అనుమతిస్తామని, విమానం ఎక్కే ముందు ప్రయాణికులకు జ్వరం, దగ్గు తదితరాలు లేవని నిర్దారించుకుంటామని వెల్లడించారు. ఇక ఇండియా నుంచి వెళ్లే విమానాల్లో ఆయా దేశాలకు వెళ్లాలని భావించి, చెల్లుబాటులో ఉండే వీసాలను కలిగున్నవారిని తీసుకెళతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, అందుకు వెళ్లాలనుకునే దేశం అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది.