The people are not stopping walking on the roads in AP
కరోనా మహమ్మారి ఏపీలో రోజుకి 70,80కేసులకు తగ్గకుండా విజృంభిస్తుంటే,జనం మాత్రం రోడ్ల మీద తిరగడం ఆపడంలేదు. పోలీసులు ఎంత చెప్పినా వినడంలేదు. ఒకవేళ లాఠీలు ఎత్తితే ఆరోపణలు వస్తున్నాయి. వాహనాలు సీజ్ చేస్తే నడుచుకొంటూ రోడ్డెక్కుతున్నారు.. వదిలేద్దామంటే కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే పోలీసు జీపులో స్టేషన్‌కు కాకుండా అంబులెన్స్ ఎక్కించి క్వారంటైన్ కేంద్రానికి తరలించడమే ఉత్తమం’ అని ఏపీ పోలీసులు భావించారు. వెంటనే దీన్ని అమలు చేసి చూపిస్తున్నారు.
రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో పోలీసులు మరింత కఠిన చర్యలు చేపట్టారు. కర్నూలు, విజయవాడ, గుంటూరుతోపాటు ఇతర ప్రాంతాల్లో పరిస్థితిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా చాలాచోట్ల ప్రజలు వినడం లేదని, ఆదివారం మాంసం దుకాణాల వద్ద ఎగబడి తోసుకొంటున్నారని, కట్టడి చేయలేక దుకాణాలు మూయించేశామని పోలీసు అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా విజయవాడ, కర్నూలు, నెల్లూరు లాంటి చోట్ల ఈ సమస్య ఎక్కువగా ఉందని వివరించారు.
అధికారుల అభిప్రాయాలు విన్న తర్వాత అనవసరంగా బయటికి వచ్చిన వారిని అంబులెన్స్‌లో క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తే ఫలితం ఉండొచ్చని డీజీపీ అభిప్రాయం వ్యక్తంచేయగా, పలువురు పోలీసు ఉన్నతాధికారులు సమర్థించారు. దీంతో సోమవారం కృష్ణలంక, మాచవరంలో పోలీసులు ఉదయం పది గంటల తర్వాత రోడ్లపై కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆపి ఆరా తీశారు. సరైన కారణం, ఆధారం చూపించని వారిని అంబులెన్స్ ఎక్కించి క్వారంటైన్‌కు పంపారు. అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు సైతం ఆకతాయిలకు ఇదే తరహా పనిష్మెంట్ ఇచ్చారు. ఇంకా కొన్ని జిల్లాల్లో దీన్ని అమలు చేయాలనీ భావిస్తున్నారు.