అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దానిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్ల రూపంలో జోకులు పేలుస్తున్నారు. వచ్చే నెల నవంబర్ 3న అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ట్రంప్ శనివారం రోజు నెవాడా రాష్ట్రం చేరుకున్నారు. ప్రచార ర్యాలీలో పాల్గొనడానికి ముందు ఆయన లాస్ వేగాస్లోని అంతర్జాతీయ చర్చిని సందర్శించి ప్రార్థనలు చేశారు. అనంతరం కొద్ది సమయం అక్కడే కూర్చున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి డొనేషన్ బకెట్‌ను చేతిలో పట్టుకుని అక్కడికి వచ్చిన వారిని విరాళాలు అడుగుతున్నాడని ముందే గుర్తించిన ట్రంప్ జేబులు సర్దుకున్నారు. కొన్ని డాలర్లను తీసి కాళ్ల మధ్యలో పెట్టుకుని వాటిని లెక్కపెట్టారు. ఇంతలో ట్రంప్ వద్దకు విరాళాలు సేకరించే వ్యక్తి చేరుకుని డొనేషన్ అడిగాడు. ఈ క్రమంలో ట్రంప్ ముందే చేతిలో పట్టుకున్న డబ్బును డొనేషన్ బకేట్‌లో వేశారు. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ట్రంప్‌కు విరాళం ఇవ్వడం ఇష్టం లేదేమో‘ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో ‘ఆస్తిపన్ను చెల్లించే సమయంలో ఇచ్చిన విరాళాల గురించి చెప్పాలి కదా అందుకే లెక్కిస్తున్నారు కాబోలు’ అంటూ చమత్కరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: