కరోనా కారణంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దేవస్థానం కూడా భక్తుల దర్శనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముగియడంతో త్వరలోనే వెంకన్న దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. ప్రతిరోజు 14 గంటల పాటు శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనుండగా గంటకు 500 మంది భక్తులను మాత్రమే అనుమతించేలా టీటీడీ ప్రణాళికలు రూపొందించింది. మొదటి మూడు రోజులు టీటీడీ అధికారులకు దర్శనభాగ్యం కల్పించనుండగా తర్వాత తిరుమల, తిరుపతిలో ఉన్న స్థానికులకు అనుమతించేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే తాజాగా టిటిడి వారు మరో తీపి కబురు తెలిపారు. ఇవాళ్ళ నుంచి భక్తులకు శ్రీవారి మహా ప్రసాదం అందజేస్తునట్లు ప్రకటించారు. శ్రీవారికి నైవేద్యంగా పెట్టిన పెద్ద లడ్డూలతో పాటు శ్రీవారి వడ ప్రసాదాన్ని కూడా విక్రయానికి పెట్టనున్నారు. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపాలనా భవనం వద్ద శ్రీవారి కళ్యాణోత్సవ లడ్డూలను విక్రయానికి ఉంచారు. అంతేకాదు ఇకపై ఎలాంటి షరతులు లేకుండా భక్తులు కోరినన్ని లడ్డూలు, వడలు తీసుకునేలా టీటీడీ వెసులుబాటు కల్పించింది. 50 రోజుల తర్వాత లడ్డూ ప్రసాదం అందుబాటులోకి రావడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: తెరుచుకున్న కేదార్నాథ్ తలుపులు