Two villages in the East Godavari district got National awards
గ్రామ పంచాయితీలలో బాగా పనిచేసేవాటిని దేశవ్యాప్తంగా కేంద్రం ఎంపిక చేసి, అవార్డులు ఇవ్వడం రివాజు. ఇలా ప్రతియేటా కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు ఐదు రకాల జాతీయ అవార్డులు ప్రకటిస్తుంది. అందులో ఇప్పటికి రెండు రకాల అవార్డులను ప్రకటించింది. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, ఈ-పంచాయతీ పురస్కార్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ స్వశక్తీకరణ పురస్కార్ అవార్డులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
అయితే ప్రకటించిన రెండు అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన తూర్పుగోదావరి జిల్లాలోని రెండు గ్రామాలకు దక్కాయి. ఇందులో కీలకమైన నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్-2020 కింద తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని చెల్లూరు గ్రామ పంచాయతీకి ఈ గౌరవం దక్కింది. గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించడం ద్వారా సామాజిక అభివృద్ధి సాధించిన గ్రామ పంచాయతీగా ఈ గ్రామాన్ని మన రాష్ట్రంలో గుర్తించారు.
అదేవిధంగా చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు కూడా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆలమూరు మండలం మూలస్థానం గ్రామ పంచాయతీ దక్కించుకుంది.పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టిన గ్రామ పంచాయతీల కేటగిరీ కింద ఈ గ్రామానికి పురస్కారం దక్కింది. అయితే ఇవి 2018-19 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలకు దక్కిన గుర్తింపు. ప్రతి రాష్ట్రంలో ఒక జిల్లాకు ఈ అవార్డును ఇస్తారు. ఇలా రెండు అవార్డులు తూర్పు గోదావరికి రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.