Visas Suspended With Corona Effect:
అంతుచిక్కని కరోనా రోజురోజుకూ విజృంభిస్తోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 వరకూ యాత్రికుల వీసాలను సస్పెండ్ చేసింది. ఐక్యరాజ్యసమితి ఉద్యోగులు, వివిథ దేశాల రాయబారులు తప్ప మిగతావారి వీసాలను వచ్చే నెల రెండోవారం వరకూ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఇక బయట దేశాల నుంచి భారత్కు వచ్చిన వారి వల్ల ఇప్పటివరకూ 60 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు.
ఇతర దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నా భారత్లో మాత్రం సాధారణంగానే ఉంది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. ఇక రోజూ ఎక్కడో అక్కడ కరోనా ఎఫెక్ట్ బయటకొస్తోంది. తాజాగా విశాఖ జిల్లాలోని అనకాపల్లిలోని ఎన్టీఆర్ వైద్యాలయంలో కరోనా కలకలం రేగింది.రావికమతం మండలం అప్పలమ్మపాలెంకు చెందిన 20 ఏళ్ల యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. దీంతో చుట్టుప్రక్కల జనాలు భయాందోళన చెందుతున్నారు.
కాగా కరోనా నేపథ్యంలో తెలంగాణలో హై అలర్ట్ ఉంది. ఎయిర్పోర్టులో 47,611 మందికి కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఒక్కరోజు 3,757 మందికి స్క్రీనింగ్ జరిగింది. ప్రస్తుతం గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో 286 మంది ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నవారు 549 మంది ఉండగా, ఇప్పటి వరకూ గాంధీలో 268 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 264 మందికి కరోనా నెగెటివ్ రాగా, 21 మంది రిపోర్ట్స్ కోసం వేచి ఉన్నారు.