YCP And TDP Leaders Over SIT Enquiry:
ఏపీలో అధికార వైసిపి,ప్రతిపక్ష టిడిపి కి అసలు ఏవిషయంలోనూ పడడంలేదు. తాజాగా సిట్ ఏర్పాటుపై కూడా రెండు పార్టీల మధ్య విమర్శలు భగ్గుమంటున్నాయి. మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సిట్ వేయడంపై మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని స్పష్టం చేశారు. ఏదో ఒక సంఘటనపై, అంశంపై సిట్ వేయడం చూశామే కాని, మొత్తం ఐదేళ్ల పాలనపై వేయడం విడ్డూరమేనని ఆశ్చరాన్ని ప్రకటించారు. సీఎం జగన్ తన పాలనా వైఫల్యాల నుంచి, భూ కబ్జాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సిట్ ప్రకటించారని ఆయన వ్యాఖ్యానించారు.
మరోపక్క మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ సీఎం జగన్ వేసిన సిట్‌కు చట్టబద్ధత లేదన్నారు. పదేపదే చంద్రబాబు అవినీతిపరుడంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. డీ పట్టా, దళితుల భూములు లాక్కోవడం సరికాదని అయన పేర్కొన్నారు.
ఇది చదవండి:సిట్ ఏర్పాటుతో జగన్ సాధించేదేంటి
కాగా మంత్రి బొత్స సత్యనారాయణ టిడిపి విమర్శలపై స్పందిస్తూ, ‘‘తప్పుచేసేవారు ఎవరైనా, ఎంతటివారైనా శిక్ష అనుభవిస్తారు. అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తొలి నుంచి చెప్తున్నాం. ప్రతిపక్ష నాయకులు ఎటువంటి విచారణకైనా సిద్ధమంటున్నారనే తొలుత ఉప సంఘం ఇప్పుడు సిట్ వేశాం’’ అని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని గవర్నర్ దృష్టికి కూడా తీసుకు వెళ్లామన్నారు. సిట్ దర్యాప్తు వేస్తే కక్ష సాధింపు అని ఎలా అంటారని ప్రశ్నించారు.