Thursday, April 15, 2021

Latest Posts

వాళ్ళ పొత్తుపై వైసిపి గరం గరం — టిడిపి కూల్ .. కూల్

బీజేపీతో జనసేన పొత్తు కట్టడం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై వామపక్షాలు మండిపడ్డాయి. వైసిపి నేతలు కూడా పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పొత్తు వెనుక టీడీపీ ఉందంటూ కొందరు వైసిపి నేతలు ఆరోపించారు. తాజాగా పశ్చిమ గోదావరికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. షరతులు లేకుండా బీజేపీతో కలిసి పనిచేస్తామనడం పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని తాడేపల్లి గూడెం వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ‘పవన్‌ కల్యాణ్‌ పవర్‌ స్టార్‌ కాదు, ఫ్లవర్‌ స్టార్‌’ అంటూ నిప్పులు చెరిగారు.

పవన్‌ రంగులు మార్చే ఊరసవెల్లిలా ఉన్నారని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పేర్కొంటూ బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఈ విషయం తేటతెల్లమైందని విమర్శించారు. కాగా టిడిపి నేత,మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ బీజేపీ, జనసేనల పొత్తు వారి వ్యక్తిగత విషయమన్నారు. అయితే ఈ పొత్తుకు టీడీపీకి సంబంధం ఉందంటూ వైసీపీ అవాస్తవాలను ప్రచారం చేయడం తగదన్నారు. అసలు జనసేన, బీజేపీ కలయికకు చంద్రబాబు కు సంబంధం ఏంటని ప్రశ్నించారు.

నిజం చెప్పాలంటే, జగన్‌ నియంతృత్వ పోకడలను, అనాలోచిత నిర్ణయాన్ని అడ్డుకోవడానికి, అమరావతి రాజధానిని కొనసాగించేలా పోరాటం చేయడానికి బీజేపీ, జనసేనలు కలిశాయని భావిస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పుకొచ్చారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీకి ఎదుటివారిపై బురదజల్లడం అలవాటుగా మారిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ ధోరణిలో మార్పు రాలేదని ఆయన వాపోయారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss