YS Jagan Finalized YCP Rajya Sabha Candidates:
రాజసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో సంఖ్యా బలాన్ని బట్టి వైసిపి నాలుగు స్థానాలు ఖచ్చితంగా వస్తాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లకు ఈనెల 7న ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ జారీచేశారు. మార్చి 6 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. ఎన్నిక అనివార్యమైతే మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసన సభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో నిర్వహిస్తారు. ఏపీ నుంచి అలీఖాన్, సుబ్బిరామిరెడ్డి, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందుకే ఆచితూచి అభ్యర్థులను సీఎం జగన్ ఎంపికచేసారు.
మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోష్, మోపిదేవి వెంకటరమణతో పాటు వైఎస్సార్సీపీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని పేర్లను సోమవారం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర శాసనమండలి రద్దు కోరుతూ తీర్మానం చేసి పంపినందున సానుకూల నిర్ణయం వస్తుందని వైసిపి భావిస్తోంది. అందుకే మండలిలో సభ్యులుగా ఉన్న మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌లు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. అయితే మండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీరిద్దరినీ రాజ్యసభకు నామినేట్ చేయాలని నిర్ణయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ అభ్యర్థన మేరకు పరిమల్‌ను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసినట్లు టాక్.
ఈ మేరకు పార్టీ అభ్యర్థులను మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి, మండలి విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ… ‘ఈనెల 6వ తేదీన రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. మా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో అభ్యర్థులను ఖరారు చేశాం. 50 శాతం బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగానే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలను రాజ్యసభకు నామినేట్ చేశాం.
పార్టీ శ్రేయోభిలాషి ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేశాం. ఇక నాలుగో సీటు పరిమల్ నత్వానికి ఇవ్వనున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ అభ్యర్థన మేరకు ఏపీ నుంచి పరిమల్‌కు ఇస్తున్నాం పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.’ అని వెల్లడించారు. పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ అభ్యర్ధన మేరకే నత్వానీకి టిక్కెట్ కేటాయించామని, అయినా ఆయన్ని తమ పార్టీ అభ్యర్థిగానే భావిస్తుస్తాని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. రాజ్యసభ టిక్కెట్లు దక్కించుకున్న ఇద్దరు మంత్రులు ఇప్పుడే రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారని ప్రకటించి.. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజీనామా చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు.